Tuesday, August 31, 2021

என் 'கால்' கதை தெலுங்கில்

                                                                                                                             நன்றி 

ஜில்லா பாலாஜி


కాలు

       ఉన్నట్టుండి తాను ఎవరూలేని ఒంటరివాణ్ణని గ్రహించటానికి వీలైంది. నిదానంగా లేచి మేడమీది గదిలో నుండి బయటికొచ్చి వరండాలో నిలబడి ఎదురుగా వ్యాపించి వున్న మామిడి చెట్టును చూశాడు. గుత్తులు గుత్తులుగా కాయలు నిండివున్నాయి. ఆరేడు ఉడుతలు... అవి తమకోసమే వున్నాయన్న హక్కుతో ఆ కొమ్మలలో ఇటు అటు పరుగెడుతున్నాయి. చాలారోజులుగా గమనించకుండా వున్న ఆ చెట్టు నిండుదనం అతనిని ఆశ్చర్యపరిచింది.

            మేడమీది గదులలోనూకింది కార్యాలయంలోనూ తక్కువంటే ముప్పైమంది పని చేస్తున్నప్పటికీఏ శబ్దమూ లేక వుడుతల శబ్దాన్ని ఇవ్వాళ మాత్రం ఒంటరిగా వినటానికి వీలైంది.

            ఇలాంటి ఒక ఏకాంతం ఏర్పడి చాలా కాలమైంది. కీర్తిప్రతిష్ఠల్ని పట్టుకొని మింగే మొదటి అంశం ఈ ఏకాంతమే. అది తనకు చిన్నవయసులోనే లభించటం అదృష్టంగానూదురదృష్టంగానూ చెప్పుకోవచ్చు. ఈ మేడమీది గది నుండి దిగి వెళ్లికారు అద్దం గుండా మాత్రమే చూసే ఆ మూలనున్న టీకొట్లో నిలబడి ఒక టీ తాగటానికి తనవల్ల వీలవుతుందా?

            గుంపు చేరిపోయిట్రాఫిక్‍ ఆగిపోయిపోలీసులు రాకుండా అక్కణ్ణించి మళ్లీ రెండు నిమిషాల నడకలో అధిగమించి తన కార్యాలయానికి చేరుకోలేని కీర్తిప్రతిష్ట అది. గత పదీ ఇరవై ఏళ్లలో మరింకే తమిళ నటుడూ ఎంతగా పోటీ పడినప్పటికీ తానున్న స్థాయిలో సగం కూడా చేరుకోలేకపోయారు.  

            ఇప్పుడు ఒక చిరునవ్వు తననూ అధిగమించి పూయటం అంతరాత్మ ఆస్వాదించింది.

            తన అలవాటైన దినచర్యల నుండి ఇవ్వాళైనా దూరం కావాలన్న మనిషి భావనను మౌనంగా అంగీకరించాడు.

            తన సొంత గ్రామంలోని పెంకుటిల్లుదాని వెనకున్న పెరడూదానికి మధ్యనున్న తులసికోటతమ ఇంటి రాత్రి భోజనమూ అన్నీ గుర్తుకొచ్చాయి.

            ఇప్పుడే గమనించాడుఆరేడు కావు పదీ ఇరవైకి పైగానే ఉడుతలు ఆ చెట్టు కొమ్మల్లో అంతా వ్యాపించి వుండటాన్ని. ఒకప్పుడు తమ ఇల్లూ ఇలాగే ఉన్నది. అది తమందరినీ బయటికి పంపించే కదా తాళం పెట్టుకుంది. తర్వాత ఒక ప్రదర్శన వస్తువైంది. ఈ చెట్టు పచ్చదనం కోల్పోయి చెట్టు ఎండిపోతేఈ ఉడుతలూ ఇక్కణ్ణిండి వెళ్లిపోతాయి. దూరమై ఎక్కడెక్కడికో వెళ్లి అతుక్కుపోతాయి. బంధాలూ స్నేహమూ వాటి ఎడబాటూకనుమరుగైపోవటం కూడా ఈ కీర్తిప్రతిష్ఠల ముందు ఏమీ లేనిదైపోతుంది.

            కాసేపటి క్రితం మెరిసిన చిర్నవ్వు మాయమై ఇంకేదో మనసును తొలుస్తోంది. బర్మా టేకుతో చేసిన తమ ఇంటి డైనింగ్‍ టేబుల్‍ గుర్తుకొస్తోంది. ఒక దినాన్ని పూర్తిచెయ్యటం కోసం ఒక్కొక్క దినమూ జరిగే కోలాహలాన్ని స్వీకరించిన మంటపం అది.

            ఎప్పుడూ అక్కే సంభాషణల్ని ప్రారంభించేది. మాటల దొంతర అగ్గిపుల్లల్లా ఎప్పుడూ ఆమె వద్దే వుండేవి. లోతుగా ఆలోచిస్తే అవి సంభాషణలు కావు. కథలు. కథలు కూడా కావు. ఒకే ఒకరి జీవితంలోనుండి తొలిచి వెలికి తీసిన చేదుమాత్రలు. ఎందుకీమె చేదును ఇంతగా ఆస్వాదిస్తుంది.

            ఆ ఇంటి డైనింగ్‍ టేబుల్‍ దగ్గరున్న కుర్చీల్లో అక్క మాససికమైన ఆర్‍.కె.వి కీ ఒక చోటుంది. చెప్పాలంటే అక్క తన ఆదర్శ రచయితకు వేసిన సింహాసనం చుట్టూ వాళ్లందరూ వున్నారు.

            అక్కడ జరిగేదంతా వినోదంగా వుంటుంది. అన్నంభోజనం బల్లమీదికి రావటానికి మునుపే అవ్వాళ అక్క కథ చెప్పటం కొన్నిసార్లు పూర్తయ్యేది. వడ్డించిన భోజనం నోటికి అందించటం మరిచిపోయి మాటలు విరిసేవి. భోజనం చివరలోనూ వివాదం ప్రారంభమయ్యేది. చిరు చిరు గొడవలు లేక రాత్రి నిద్ర వుంటుందా?

            పగటిపూట ఆర్‍.కె.వి. కథలు చదవటమూసాయంత్రం దాకా వాటి గురించే చర్చించే అక్కకు రాత్రి భోజనం రణస్థలమే. తన మేథస్సు ఈ వివాదాల ద్వారా పదును తేలటం ఆమె గ్రహించి ఒక్కో రాత్రికోసమూ ఎదురుచూసేది.

            నాన్నఅన్నాఎప్పుడూ ఆమె మాటలను వ్యతిరేకించేవాళ్లుగానూవదినాఅతనూ దాన్ని మౌనంగా భద్రపరుచుకునే  వాళ్లుగానూ వున్నారు. వదినె మౌనం ఎవరివల్లా కొలవటానికి వీలుకాదు.

            అప్పటివరకూ వున్న మొత్తం తర్కాన్నీ చెదరగొట్టేందుకు ఆమెకు ఒక వాక్యం కాదుఒక్క మాట చాలు. ఆమె ప్రదర్శించే ప్రశాంతత అందరినీ ఎప్పుడూ ఒక రకమైన అప్రమత్తతలోనే వుంచుతుంది.

            అతనికి చదవటంపై ధ్యాస పెట్టలేని కాలం అది. వినటంచూడటందృశ్యీకరించటం. ఇది వరుస మారి మారి వస్తూ వెళుతుండేవి.

            అయితేఒక ముగింపుకు వచ్చేశాడు. ఈ ముఖం తెలియని ఆర్‍.కె.వి ఎప్పుడూ ఈ ఇంటి డైనింగ్‍హాల్లో కూర్చుని వివాదాల సంకెళ్లను తెంపేసేవాడు. అది స్వేచ్ఛగా పరుగులు తీసేవి. అవి కొలిక్కి రావటానికి ముందు రాత్రి తనలో అందరినీ పొదుపుకునేది. ఇది తీరని వ్యాధిలాగా వ్యాపించింది. చెన్నైకు వచ్చిమొదటి ఆరేడు సినిమాలలోనే తారాస్థాయికి వెళ్లి,  క్షణకాల ఏకాంతానికీ తపించిన ఒక వర్షాకాల రాత్రిపూటసినిమా షూటింగ్‍ రద్దయ్యి ఇదేవిధంగా జీవించిన ఒక ఏకాంతంలోనే ఆర్‍.కె.వి యొక్క మొదటి కథను అతను చదివాడు. ఆ సంపుటిని పూర్తి చేయటానికి అతనికి యేడాది సరిపోలేదు. ఇప్పుడు వివాదాలను మొదలుపెట్టేందుకు అక్క అవసరం లేదతనికి. అతను మాత్రమే చాలు. నాన్నఅన్నా తననుండి ఎంత దూరంలో నిలబడ్డారో కొలవటానికి వీలైందీ అప్పుడే.

            అక్క ప్రతిరోజూ ఆరోజుటికి తగ్గ అగ్గిపుల్లల్ని ఈ దాచిన దానిలో నుండే వెలిగించేటట్టుంది. వదినె తన మౌనంతో వాటిని మనసులోనే అంగీకరిస్తున్నట్టుంది.

            ఈ నిదానంలోఉడుతల ఉత్సాహంలోఒక పండిన మామిడికాయ రాలిన శబ్దంలో అన్నీ అర్థమవుతున్నాయి.

            జీవితం తనను మాత్రమే ఎందుకు ప్రారంభంలోనే తారాస్థాయికి తీసుకెళ్లి దింపిమిగతా వాళ్లందరినీ వంగి చూసేలా చేసిందిపిచ్చిపట్టి చదివిన అక్కను ఏది దాన్ని విదిలించి పడేసేలా చేసిందివిని పెరిగిన నన్ను ఏది చదవటానికి ప్రేరేపించిందిఅన్నీ ఎప్పుడూ మార్పుకు లోనయ్యేవే.

            ఇప్పుడు శబ్దం చేస్తూ నవ్వటానికి వీలైంది.

            నలభై ఏళ్లుగా చూడటానికి ఇష్టపడని ఆర్‍.కె.వి. ని ఇవ్వాళ చూడాలని ఇదిగో ఈ ఎవరూలేని ఈ తరుణం అతనిని ముందుకు నెడుతున్నది. ఆయనతో మాట్లాడటానికివిమర్శించటానికిగొడవపడ్డానికిఇప్పటివరకూ అడ్డుపడ్డ కాలం పరుగులు పగిలి చెదిరిపోతున్నాయి. ఆ జ్ఞాపకాల అంతంలో టి.నగర్‍లోని జగదీశ్వరన్‍ వీథిలో కాస్త లోపలగా వున్న ఆ ఇంటి ముందు అతని రేంజ్‍ రోవర్‍ కారు ఆగింది.

            దారంతా అతని ఎన్నో హావభావాలతో వున్న పెద్ద పెద్ద బ్యానర్లు అతనిని ఇంకా పారవశ్యానికి లోను చేసింది.

            కార్లో నుండి దిగి ఆ వీధిని చూశాడు. ప్రజలు తమ తమ దినచర్యలలో మునిగిపోయి వున్నారు. ఒక్కరూ తనను గమనించలేదని కదలగానే ఎక్కణ్ణించో నలుగురైదుగురు పరుగెత్తుకొచ్చి కరచాలనం చేశారు. ఎదురింటి నుండి ఒక స్త్రీ నలిగిన చుడీదార్‍తో  ఒక ఆటోగ్రాఫ్‍ కోరుతూ నిలబడింది. అంతా ఒక్క క్షణమే. వెంటనే ఆ ఇంటికి పక్కనే వున్న మేడమెట్లపై నడుస్తున్నాడు. తన షూల శబ్దం ప్రత్యేకంగా వినిపించటం గ్రహించాడు. ఇది తాను’ అన్న గొప్పతనానికి చిహ్నం. నన్ను గమనించునన్ను గుమిగూడు’ అన్న ప్రాబల్యపు ఆహ్వానం. ఆగి తన షూలను విప్పేశాడు. ఒక్కక్షణం వాటిని అక్కణ్ణించి అలాగే విసిరేద్దామనిపించింది. అయితే వీలుకాలేదు.      

            మెట్ల పక్కగా వాటిని వేరుగా పెట్టాడు. తనవాటితో పోల్చటానికి వీలుకాని ఇరవైకి పైగా చెప్పులు అక్కడున్నాయి. వాటిని బట్టి లోపలున్న వాళ్లను అంచనా వెయ్యటానికి ప్రయత్నిస్తున్న తన అజ్ఞానానికి తనకే వాంతి వచ్చేలా అనిపించింది.

            నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించాడు. అది మేడమీద కొబ్బరాకులతో కట్టిన ఒక కొట్టం. ఒక సౌకర్యవంతమైన కుర్చీలో ఆర్‍.కె.వి కూర్చొని వుండగా ఆయనకు ఎదురుగా కొందరు కూర్చొని కనిపించారు.

            ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించాడు. ఈ వినయం తన జీవితంలోనే మొదటిసారి.

            ఆయనలోని అలక్ష్యాన్ని గమనించాడు. లేదూ తనముందు ఇప్పటివరకూ కొనసాగిన వంగొని వుండే స్థితికి ఇది మొదటిసారి వ్యతిరేకం.

            ‘‘కూర్చోండి.’’ అని ఎదురుగా వున్న ఒక పాత కుర్చీని చూపించారు.

            ఆయన ముందు వ్యాపించి వున్న మౌనంలో మాటలన్నీ కుమ్మరించి వున్నాయి. అందులో ఒక్కమాట కూడా అతనివల్ల ధైర్యంగా తాకటానికి వీలుకాలేకపోయింది. చాలాసేపటి తపన తర్వాత, ‘‘మీరెందుకు ఇప్పుడు ఏమీ రాయటం లేదు?’’ వరుసగా పేర్చిన మాటలు చెమర్చాయి.

            ‘‘రాసిందే ఎక్కువని ఇప్పుడనిపిస్తోంది.’’

            సన్నని చిరునవ్వు ఒకటి పూచేలా చేశాడు.

            ‘‘నేను మీ కథలను విని పెరిగినవాణ్ణి.’’

            ఆయన ఇప్పుడే అతణ్ణి ముఖాముఖి చూశారు. చూపులు చాలా దగ్గరగా వున్నాయి.

            ‘‘పెరిగాకే చదవటం మొదలుపెట్టాను.’’

            ‘‘ఎవరు పెరిగాక?’’

            మౌనాన్ని ఇద్దరూ ఆశ్రయించారు.

            ‘‘మీరు మీ గాయత్రిని ఒక రోల్‍మోడల్‍గా చేసి సమాజం ముందు నిలబెడుతున్నారు. అది నాకు సమంజసమనిపించటం లేదు. కేవలం  సంచలనాల కోసం కావాలనే సృష్టించారు. గాయత్రి మునుపటిలా లేదు.’’

            అతను మాట్లాడుతూ వున్నాడు. ఆయన అతనిని అధిగమించి తన చూపులతో దూరంగా వున్న ఒకరి దగ్గర ఆగారు. అతనూ ఆగకుండా ఆయన ముందు గుమ్మరించసాగాడు. చాలు అని భావించగానే ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ‘‘రాసిన వాటిని గురించి మాట్లాడటమన్నదిశవం వెంట్రుకలను దువ్వటం లాంటిది. అది నాకెప్పుడూ ఇష్టం వుండదు.’’

            ‘‘మీరు రాసిన వాటికి మీరు బాధ్యులు కారా?’’

            ‘‘అది అచ్చుకుపోయిన వెంటనే నేను దాన్నుండి నన్ను ఖండించుకుంటాను. తర్వాత అది నీలాంటి పాఠకుడి బాధ్యత.’’

            ‘‘అయితే సమాజానికి సాహిత్యంపట్ల భాగస్వామ్యమెంత?’’

            ‘‘వీటికంతా సమాధానం నా దగ్గర లేదు.’’

            ఈ మాటలలో ఎన్నో ఏళ్ల విసుగుంది.

            ‘‘సరేమీ కథలు ఒక సామాన్య మానవుణ్ణి ఏం చెయ్యగలుగుతుందని భావిస్తున్నారు?’’  

            ‘‘ఒక్క బొచ్చూ చెయ్యదని అనుకుంటున్నాను.’’ అనితన ఎడమచేతిపై పెరిగి వాలిన వెంట్రుకలను పక్కకు తోశాడు.

            ‘‘అయితే ఎందుకు సార్‍ రాస్తున్నారు?’’

            ‘‘ఎందుకో రాస్తున్నాను. నిన్ను ఎవరు చదవమన్నారుఅంతటితో ఆగకుండా రాసినవాణ్ణి వెతుక్కుంటూ వచ్చి ఇలా రెచ్చగొట్టటం అనాగరికం.’’

            అతను నిశ్చేష్ఠుడయ్యాడు. ఇంకా మిగిలి వున్న మాటలూ లోలోపలే అణిగారిపోయాయి.

            గాజు గ్లాసులలో అందరికీ టీ వచ్చింది. ఆయన ఒకదాన్ని తీసుకొని అతనికీ ఇవ్వమని చెయ్యి చూపించారు.

            టీ తీసుకొచ్చిన పిల్లవాడి వెనకే ఎంతో హుందాగానూగంభీరంగానూ వున్న ఇంకొక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు.

            ‘‘రండి బి.ఎస్‍!’’ అని ఎంతో ఆప్యాయంగా ఆయనను ఆహ్వానించితన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇతనిని చూసి ఆయన ఒకింత కూడా ఆశ్చర్యపోయినట్టుగా అనిపించలేదు. అయితే అతను లేచి నిలబడ్డాడు.

            ‘‘ఈయన నా నలభైఏళ్ల మిత్రుడు. పేరు బి.ఎస్‍.’’

            ఆ మిత్రుడు ఎంతో హుందాగా కరచాలనం చేశాడు.

            ‘‘మీరు మాట్లాడుతూ వుండండి.’’ అని దూరంగా వున్న ఇంకో కుర్చీ దగ్గరికెళ్లాడు. జరుగుతున్నదంతా ఇంతకుమునుపు అతను చూడనటువంటివి.

            ‘‘నాకు తమిళనాడంతా రెండువేలకు పైగానే సామాజిక సేవా సంస్థలున్నాయి.’’

            ‘‘అభిమాన సంఘాలా?’’ అలక్ష్యానికి చిహ్నంగా మాటలు వెలువడ్డాయి.

            ‘‘మరో దారి లేదు. నేనూ వాటిని అలాగే స్వీకరించాల్సి వచ్చింది. అయితే వాటిని నేను వృద్ధి చెయ్యటానికీఇంకా పై స్థాయికి తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తున్నాను.’’

            ‘‘చెయ్యండి.’’అలక్ష్యం కొనసాగింది.

            ‘‘వాళ్లు చదువుతారాసమాజానికి ఏదైనా చెయ్యదగినవారేనా?’’

            ‘‘ఔను!’’

            ‘‘మంచిది.’’

            ‘‘అందుకు మీ సాయం కావాలి.’’

            ‘‘నేనేం చెయ్యగలనని మీరనుకుంటున్నారు.’’

            ‘‘ఏం లేదుఏం లేదు. మేం నడిపే ప్రాంతీయ మహానాడులో మీరొచ్చి మాట్లాడాలి!’’

            ‘‘సారీ. ఇలా అభిమాన సంఘాలకంతా వచ్చి మాట్లాడి నా సమయాన్ని వృథా చేసుకోవటం నాకిష్టం లేదు.’’

            ‘‘లేదు. మీరు అలా పక్కన పెట్టేయకండి. అభిమాన సంఘాలంటే అంత  కేవలమైంది ఏం కాదు. అందులోనూ చదువుకున్న వాళ్లుసృష్టికర్తలూడాక్టర్లుశాస్త్రవేత్తలూ అందరూ వున్నారు.’’

            ‘‘వాళ్ల ముందు నేనేం మాట్లాడతాను. నేను ఎనిమిదో తరగతి కూడా దాటలేదు.’’

            సంభాషణలోని తీవ్రతను గట్టిగా పట్టుకొని పైకెగబ్రాకాడు.

            ‘‘మీరిలా నిరాకరిస్తే నేనెలా సార్‍ వాళ్లను పై స్థాయికి తీసుకెళ్లేది. అలాగే అక్కడే వొదిలేస్తే...’’ అని కాస్త గొంతును పెంచాడు.

            అతనే ఊహించని ఒక తరుణంలో, ‘‘వస్తానుఏ రోజుటికి?’’ అని అడిగారు.

            ‘‘మీరు ఎప్పుడు చెబితే ఆ రోజు.’’ అని పరవశించాడు.

            ‘‘డిసెంబర్‍ 11 భారతియార్‍ పుట్టినతేదీకిఏ చోట్లో?’’

            ‘‘నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను సార్‍. చాలా ధన్యవాదాలు.’’ అని చేతులు జోడించి లేచినవాణ్ణి మళ్లీ చెయ్యి చూపించి కూర్చోమని చెప్పారు.

            ఇప్పుడు అందరి చుట్టూ తిరుగుతూ వున్న ఆ పైపు(గంజాయి పైపు) మూడవసారి అతని దగ్గరకొచ్చింది. గాఢంగా ఒకసారి లోపలికి పీల్చి ఇచ్చినదాన్ని ఆనందంగా తీసుకునేందుకు రెండు చేతులు చాచి ఎదురుచూస్తున్నాయి.

            ఇతను సెలవుతీసుకున్నప్పుడు ఆ గదిలోని ఒకవ్యక్తి పాడటం మొదలుపెట్టాడు. దానికి బాక్‍గ్రౌండ్‍గా అక్కడ అలుముకున్న చిరు పొగమేఘాలు కమ్ముకుని కనిపించాయి.

            ‘ఉదయించటమూ లేదు అస్తమించటమూ లేదు ప్రకాశించే సూర్యుడు

            పెరిగేది లేదు తరిగేది లేదు పరిహసించే చంద్రుడు

            జీవితం ఒక రూపంక్షణంలో ఎన్నో మార్పులు

            చదివిందీ లేదుపరీక్షలూ లేవు నా జాతకం

            స్వశక్తి వుందిఇంకే బలమూ లేదు కవితా జీవితం

            మెట్లు దిగుతుంటే అతని పెదాలపై కవితా జీవితం...’ అని గొణుగుతూ వున్నాడు.

 

                                                                        () () ()

 

            అదొక ప్రవైటు పాఠశాల యొక్క విశాలమైన మైదానం. వేదిక అలంకరణలో ప్రతీచోటా ప్రత్యేక శ్రద్ధాదృష్టీ పెట్టటం జరిగింది. అతని పదిరోజుల సినిమా చిత్రీకరణ పూర్తిగా రద్దైయింది. కొన్ని కోట్లు పక్కకు మళ్లాయి. అన్నింటిలోనూ తుది నిర్ణయం అతనిదిగానే వున్నదివేదికమీద మూడు కుర్చీలు మాత్రమే వుండాలనేంత వరకూ.

            ఒకటి ఆయనకుఇంకొకటి తనకుమూడవది సేవాసంస్థ ప్రాంతీయ అధ్యక్షునికి.

            ‘‘కారు పంపించనా సార్‍?’’

            ‘‘వద్దు. సరిగ్గా ఆరున్నరకు స్నేహితునితో కలిసి కార్లో వచ్చేస్తాను.’’

            అలాగే ఆరు ముప్పైఐదు నిమిషాలకు ఆ కారు మైదానంలోకి నిదానంగా ప్రవేశించింది.

            వేదిక పక్క నుండి పరుగుపెట్టి కారు ముందరి తలుపు తెరిచి ఆయనకు కరచాలనం చేసిఅక్కడే ఒక శాలువను కప్పిగొప్ప కోలాహలం మధ్య ఆయనను గంభీరంగా వెంటబెట్టుకొని వచ్చాడు. వందలకొద్దీ కెమెరాలు పోటీలు పడి మెరిశాయి.

            వేదికమీద నిలబడి నమస్కరించారు. పక్కన నిలబడి అతను అందరినీ కూర్చోమన్నట్టుగా చేత్తో సైగచేశాడు. కాస్త కూడా విరామం లేకుండా అధ్యక్షుడు తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.

            ‘‘మన కథానాయకుడు ఎంత గొప్పవారో చూడండి. ఆయనే కీర్తిప్రతిష్ఠలు తారాస్థాయిలో వున్న ఒక నటుడు. అయితే తన ఆదర్శ రచయితను మనకోసం ఆహ్వానించి ఆయన ఒక సేవకుడిలా దీనికోసం శ్రమించి...’’ మాటలు తడబడసాగాయి. ఇదివరకే విన్న హితవచనాలకు బలం చేకూరిమొత్తం గుంపు నిశ్శబ్దాన్ని పాటించింది.

            ఈల శబ్దమైనాఅదెక్కణ్ణించి వచ్చిందో తెలిపేటంత నిశ్శబ్దం అది.

            ఆర్‍.కె.వి. తన కాలిమీద కాలు వేసుకొని ఆ కుర్చీలో వెనక్కు ఆనుకొని కూర్చొని వున్నారు. పకనే ముఖంలో ఆనందమూపారవశ్యమూ కలగలిసిన అతనున్నాడు.

            ‘‘కాలును తియ్యరా.’’ అని ఒక ఆవేశపూరితమైన గొంతు గుంపులో నుండి వచ్చింది.

            మాటలు తెగి పడ్డాయి. ఆదుర్దాగా లేచి అతను మైక్‍ ముందు నిలబడ్డాడు. ఆయన ఆ గొంతు వినవచ్చిన దిశగా చూస్తూతన చేతిని వుంచుకొని కాళ్లను దూరం పెట్టుకున్నారు. అన్నీ జరిగి పూర్తికావటానికి ఒకట్రెండు నిమిషాలు కూడా కాలేదు. ఎంతో ఆదుర్దాతో అతను మాట్లాడటం మొదలుపెట్టాడు.

            ‘‘ఏది జరగకూడదని నేను భావించానో అదే జరిగిపోయింది. అభిమాన సంఘాలంటే అది థర్డ్ రేట్‍ మనుషుల గుంపు అని ఆయన మొండిగా రావటానికి నిరాకరించారు. నేనే ఆయనను బలవంతం పెట్టి పిలుచుకొచ్చాను. మేమంతేరా అని మీరు నిరూపించేశారు.

            అయ్యోనేను వినిచదివిపెరిగిన ఒక జెయింట్‍ను ఇలా అవమానించేశారు కదరా. ఇంకో ఐదు నిమిషాలలో అలా అరిచిన వ్యక్తి ఈ వేదిక మీదికి రావాలి. మీ అందరి ముందూ సార్‍ కాళ్లమీదపడి క్షమాపణ అడగాలి. అప్పుడే ఈ కార్యక్రమం కొనసాగుతుంది.’’ అని మాట్లాడుతుండగా వేదికమీద నుండి వచ్చిన చిన్న కదలికను విని వెనక్కు తిరిగాడు.

            నలిగిన తెల్ల చొక్కాతో ఒక వ్యక్తిని నేలమీద కూర్చోపెట్టి వున్నారు. పెదవి చివరన సన్నని రక్త రేఖ కనిపించింది. కొట్టినట్టున్నారు. అతని చుట్టూ ఆరేడుమంది నిలబడి వున్నారు.

            ‘‘ముందు మీరందరూ కిందికి దిగండి.’’

            ‘‘ఆయనను అవమానించిన ఆ వ్యక్తి ఇప్పుడు ఈ సభలోనే ఉన్నాడు. ఇప్పుడు మనందరి ముందూ...’’

            అతను మాట్లాడుతూ వుండగానేకింద కూర్చొని వున్నవాడు దూకి ఆయన ముందు టీపాయ్‍మీదున్న హ్యాండ్‍మైక్‍ను తీసుకున్నాడు. అది జారి క్రిందపడింది. అనవసరంగా అతని చేతులూ మాటలూ వణికాయి.

            ‘‘ఆయన మా వాడుఆయన మా వాడు.’’

            మత్తులో అతను గొంతెత్తి అరిచాడు. మొత్తం సభను లోబరుచుకునేంతగా అతని గొంతు ప్రతిధ్వనించింది. అతను టీపాయ్‍మీద తలను వాల్చివేదిక యొక్క నేలమీద దాదాపు ఒక వలయంలా మెలి తిరిగి విచిత్రంగా కూర్చొని వున్నాడు. తన రెండు సన్నని కాళ్లను పక్కకు పెట్టుకొని వున్నాడు.

            అతను ఇంకా ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నంతలో వేదికమీద నిలబడ్డవాడు దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించి ఆయనకేసి తిరిగి చూశాడు. ఆయన ఎంతో స్వాభావికంగా కాలిమీద కాలు వేసుకొని మునుపటికన్నా గాంభీర్యంగా కూర్చొని వున్నారు.

                                                           

() () ()

 

No comments:

Post a Comment